Ravindra Jadeja: ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజా ఉన్నట్టుండి గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్‌కే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతడు మ్యాచ్‌లో గాయపడకుండా కేవలం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంతోనే గాయపడినట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజీలో హాంకాంగ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత రిలాక్సేషన్ కోసం దుబాయ్‌లోని సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయబోయి జడేజా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అ సందర్భంగా జడేజా కాలు మడతపడటంతో గతంలో గాయం తిరగబెట్టిందని.. దీంతో అతడు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఇంగ్లీష్ మీడియా కథనాలు రాసుకొచ్చింది.
Read Also: Asia Cup 2022: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్.. మూడు క్యాచ్‌లపై అనుమానం
అటు ఆల్‌రౌండర్ జడేజా గాయానికి దారితీసిన సంఘటనల గురించి అధికారిక ప్రకటనలు విడుదల కానప్పటికీ.. కొంతమంది బీసీసీఐ అధికారులు భారత స్టార్ ఈ రకంగా గాయపడటంపై తీవ్రంగా మండిపడుతున్నట్లు అర్థమవుతోంది. టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌కు ముందు జట్టులో సమతూకం కోసం బీసీసీఐ ప్రయత్నిస్తుంటే అనవసర తప్పిదాలతో స్టార్ ఆటగాళ్లు ఇలా గాయాల బారిన పడడం బీసీసీఐ అధికారులకు ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే జడేజా గాయంపై కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నోరు విప్పడం లేదు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా టూర్, టీ20 ప్రపంచకప్‌కు జడేజా దూరమైనట్లే భావించాలని బీసీసీఐ అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం అందుతోంది.
