మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక బౌలర్లను ఉతికారేసిన జడ్డూ.. ఏకంగా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా టెస్ట్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ మాత్రమే.
ఈ క్రమంలో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా 175 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా టీమిండియా తరఫున ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉండేది. అతడు 1986లో శ్రీలంకతోనే జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఏడో స్థానంలో బరిలోకి దిగి 163 పరుగులు చేశాడు. తాజాగా కపిల్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో పంత్ ఉన్నాడు. పంత్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 159 పరుగులు చేశాడు.
అంతేకాకుండా జడేజా ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. ఏడో నంబరులో బ్యాటింగుకు దిగి 300 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో భాగం పంచుకున్న తొలి వ్యక్తిగానూ అవతరించాడు. ఏడో నంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగుకు దిగి అజేయంగా 175 పరుగులు సాధించిన తొలి భారతీయుడిగానూ జడేజా రికార్డు సృష్టించాడు.
