NTV Telugu Site icon

Ravi Shastri: ఆ విషయంలో ధోనీనే బెస్ట్

Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri On Praises MS Dhoni Over LBW: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఎంత ఘోర పరాజయం చవిచూసిందో అందరికీ తెలుసు. బ్యాటింగ్‌లో అదరగొట్టినా.. బౌలింగ్‌లో మాత్రం విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఫీల్డింగ్‌లో కూడా చాలా తప్పిదాలు జరిగాయి. దానికితోడు.. ఓ ఎల్‌బీడబ్ల్యూ అవకాశాన్ని ఆటగాళ్లు గుర్తించకపోవడం కూడా జట్టు ఓటమికి కారణమైంది. బహుశా అది గుర్తించి ఉండుంటే, అప్పుడు మ్యాచ్ ఫలితాలు మరోలా ఉండేవని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయంపై తాజాగా రవిశాస్త్రి స్పందిస్తూ.. అలాంటి ఎల్‌బీడబ్ల్యూ అవకాశాల్ని గుర్తించడంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ఉత్తముడని కొనియాడారు. ‘‘ఇలాంటి ఎల్‌బీడబ్ల్యూ విషయంలోనే వికెట్ కీపర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ ఉత్తమంగా వ్యవహరించేవాడు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.

ఇకపోతే.. తొలి మ్యాచ్‌లో 208 పరుగులు చేసిన టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడానికి పేలవ బౌలింగ్ ప్రదర్శనతో పాటు మిస్ ఫీల్డ్స్ చేయడం ప్రధాన కారణాలు. ఓపెనర్‌గా వచ్చిన కామరూన్ గ్రీన్ 5వ ఓవర్లోనే ఔట్ అయ్యేవాడు. ఓ ఓవర్‌లో చాహల్ వేసిన ఐదో బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. కానీ, భారత్ వైపు నుంచి ఎవ్వరూ అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత అది ఎల్‌బీడబ్ల్యూగా తేలింది. దీంతో అందరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అలా లైఫ్ రావడంతో.. గ్రీన్ చెలరేగిపోయి ఆడాడు. 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి, ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. శుక్రవారం ఆసీస్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇది భారత్‌కి అత్యంత కీలకమైన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే.. సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే, చేజారినట్టే!