Site icon NTV Telugu

Ravishastri: టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించొద్దు

Cricket

Cricket

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్‌ఇండియాలో ఎంపికైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారాడు. ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఉమ్రాన్ మాలిక్‌కు మొదటి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకోవాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మాలిక్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రాతినిధ్యం వహించలేదు.

ఈ తరుణంలో రవిశాస్త్రి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం టీ20 జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇవ్వకూడదని మాజీ కోచ్‌ సూచించాడు. ‘మాలిక్‌ను టీమ్‌తో తీసుకెళ్లండి. కానీ, అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఉమ్రాన్‌కు వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత అతని ప్రదర్శన భవిష్యత్తును నిర్ణయిస్తోంది’ అని పేర్కొన్నాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లకు మించిన వేగంతో బంతులను సంధించి మంచి ప్రదర్శన చేయడం చూశాం. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో మ్యాచుల్లో అవకాశం వస్తే సత్తా చూపిస్తాడేమో? అన్న అంచనాలున్నాయి. అయినా కానీ, అతడు ఇంకా ఎంతో మెరుగుపడాలని, అనుభవం సంపాదించాల్సి ఉందన్నాడు రవిశాస్త్రి. అతడికి అప్పుడే అంచనాలతో అవకాశం ఇవ్వడం తొందరపాటు అవుతుందన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు, ఉమ్రాన్ మాలిక్ అన్ని మ్యాచ్‌లలో వేగంగా బంతిని విసిరి, అవార్డులను గెలుచుకున్నాడు. ఇది కాకుండా, ఉమ్రాన్‌కు వికెట్లు తీయగల సామర్థ్యం కూడా ఉంది. అతను 14 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశాడు. టీమిండియా ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉమ్రాన్ మాలిక్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు.

Exit mobile version