Site icon NTV Telugu

Ravi Shastri: కోహ్లీ.. దయచేసి ఐపీఎల్ నుంచి తప్పుకో

Virat Kohli

Virat Kohli

ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రన్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతుండటం కెరీర్‌లో బహుశా ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా కోహ్లీ టీమ్‌కు భారంగా మారాడనే చెప్పాలి. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడా వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో అయితే తొలి బంతికే పెవిలియన్ బాట పట్టాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. విరాట్ కోహ్లీ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలన్నాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కాస్తంత విరామం అవసరమన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ గతంలో జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి కావాలని, మైండ్‌ను ఫ్రెష్ చేసుకోవాలని సూచించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకోవాలనుకున్నా.. క్రికెట్‌లో మరికొంతకాలం తనదైన ముద్ర వేయాలన్నా కోహ్లీ తక్షణం ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే బెటరని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ ఆటగాడిగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికాడు.

కాగా కోహ్లీ ఇలాగే ఆడితే అతడి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది. జట్టులో స్థానం కూడా దక్కకపోవచ్చు. మరోవైపు కోహ్లీలో ఆత్మవిశ్వాసం కూడా కనిపించడంలేదు. నాయకత్వ బాధ్యలు భారంగా మారాయని వాటిని వదులుకున్న కోహ్లీ.. ఇప్పుడు ఆ బాధ్యతలు లేకపోయినా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ప్రత్యర్థి జట్ల బౌలర్ల ఉచ్చులో సులభంగా చిక్కుకుంటున్నాడు. రానున్న ప్రపంచ కప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన అస్త్రాలు. అప్పటిలోగా రికార్డుల రారాజు కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

MS Dhoni: సుప్రీంకోర్టులో ధోనీ పిటిషన్.. ఎందుకంటే..?

Exit mobile version