SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్‌ఆర్‌హెచ్ ఔట్.!

  • సూర్యవంశీ విధ్వంసం.. రాజస్తాన్ భారీ స్కోరు
  • జురెల్ మెరుపులతో 243 పరుగుల పర్వతం
  • ట్రావిషెక్ ఫెయిల్.. హైదరాబాద్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది
  • ఆర్చర్ దెబ్బకు ఎస్ఆర్‌హెచ్ కథ ముగింపు
Rr

Rr

ఐపీఎల్ ప్లేఆఫ్స్ (IPL Playoffs) ఉత్కంఠ పోరులో రాజస్తాన్ రాయల్స్ (RR) ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో రాజస్తాన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడేందుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడి అండగా నిలిచాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 334.48 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 29) నెమ్మదిగా ఆడినా, సూర్యవంశీ విధ్వంసంతో తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 26 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (0)ను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 11 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు చేసి జోరు మీదున్నట్లు కనిపించినా ఆర్చర్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17)ను కూడా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), హెన్రిచ్ క్లాసెన్ (18) కాసేపు పోరాడినా రన్ రేట్ ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో హైదరాబాద్ నడుము విరవగా, నండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. చివరి ఓవర్లో శివాంగ్ కుమార్ (27) వికెట్‌ను సుశాంత్ మిశ్రా పడగొట్టడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 196 పరుగుల వద్ద ముగిసింది.