టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పనితీరుపై భారత మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ జట్టు కూర్పు, ఓపెనింగ్ జోడీ, బౌలింగ్ విభాగంపై ప్రస్తుతం అనేక చర్చలు జరుగుతున్నాయని.. ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో మాత్రం జట్టులో ఎలాంటి అనిశ్చితి లేదన్నాడు. ప్రతి నిర్ణయం పక్కా ప్రణాళికతోనే తీసుకునేవాడని.. ఆటగాళ్లకు తగినంత సమయం, మద్దతు ఇచ్చేవాడని యాష్ వెల్లడించాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘రాహుల్ ద్రవిడ్ ఎలాంటి ప్రణాళిక లేకుండా ఏదైనా చేశాడని ఎవరైనా చెప్పగలరా?. ఒక్కసారిగా ఎవరినైనా జట్టు నుంచి తప్పించి అవకాశం ఇవ్వలేదని చెప్పగలరా?. ద్రవిడ్ ఎప్పుడూ ఆటగాళ్లకు స్థిరత్వం కల్పించాడు. హార్దిక్ పాండ్యాను అద్భుతంగా వినియోగించాడు. 2023 ప్రపంచ కప్‌లో అతడు గాయపడటం దురదృష్టకరం. శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా, కేఎల్ రాహుల్‌ను కీలక బ్యాటర్‌గా నమ్మాడు. విదేశీ పర్యటనల్లో శార్దూల్ ఠాకూర్‌ను నంబర్-8లో కొనసాగించాడు. కుల్దీప్ యాదవ్‌ను మూడో స్పిన్నర్‌గా స్థిరపరిచాడు. ఇవన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే’ అని చెప్పాడు.
రాహుల్ ద్రవిడ్ హయాంలో ఆటగాళ్లు ఎప్పుడూ అస్థిరతను అనుభవించలేదని అశ్విన్ పేర్కొన్నాడు. ‘విమర్శలు ఎవరినైనా వెంటాడుతాయి. ప్రపంచంలో అత్యుత్తమ కోచ్‌లను కూడా విమర్శిస్తారు. కానీ ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన ఆటగాళ్లను అడిగితే.. అతను కోచ్‌గా ఎలా వ్యవహరించాడో వాళ్లే చెబుతారు. ప్రతి ఒక్కరికీ తగిన మద్దతు ఇచ్చాడు. అందరినీ సమానంగా చూసేవాడు. ఎవరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కాలేరు. కానీ ద్రవిడ్ తన బాధ్యతను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించాడు’ అని వివరించాడు.
2023 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే 2027 వరల్డ్ కప్ కోసం ప్రణాళికలు ప్రారంభం కావాల్సిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘ఏ ఆటగాళ్లను దీర్ఘకాలం కొనసాగించాలి?, ఎవరు వన్డే స్పెషలిస్టులు?, వర్క్‌లోడ్‌ను ఎలా నిర్వహించాలి? వంటి అంశాలపై అప్పుడే బ్లూప్రింట్ సిద్ధం చేయాల్సి ఉంది. ఆ సమయంలో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్నాడు. కాబట్టి అతను 2027 వరకు ప్రణాళిక రూపొందించి ఉండాలి. ఒకవేళ తాను ఎక్కువ కాలం కొనసాగబోనని ముందే నిర్ణయించుకుని ఉంటే.. ఆ ప్రణాళికలను డాక్యుమెంట్ చేసి తర్వాతి కోచింగ్ బృందానికి అందించి ఉండాలి’ అని అభిప్రాయపడ్డాడు.
వీవీఎస్ లక్ష్మణ్‌తో రాహుల్ ద్రవిడ్ సమన్వయాన్ని కూడా ఆర్ అశ్విన్ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘భారత్-ఏ, అండర్-19, సీనియర్ జట్టు కోచింగ్ పూర్తిగా భిన్నమైనవి. ద్రవిడ్, లక్ష్మణ్ ఇద్దరూ తరచూ చర్చించుకుని మధ్యమార్గం కనుగొనేవారు. లక్ష్మణ్ ఏ పర్యటనకైనా 20 రోజుల ముందే సిద్ధమవుతాడు. తానే మ్యాచ్ ఆడబోతున్నట్టుగా ప్రతి అంశాన్ని ముందుగానే ప్లాన్ చేస్తాడు. అలాంటి సమన్వయమే భారత క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేసింది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

