దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. గురువారం ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. మ్యాచ్‌లో డికాక్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ రికార్డు బ్రేక్ అయింది.
భారత జట్టుపై 12 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లలో ఐదుసార్లు క్వింటన్ డికాక్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. నికోలస్ పూరన్ 20 ఇన్నింగ్స్‌లలో ఐదుసార్లు హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ 24 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక డికాక్ తొందరపాటుతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు రన్ కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. 16వ ఓవర్ తొలి బంతికి డికాక్ షాట్ బాదేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాగి కీపర్ దిశగా దూసుకెళ్లింది. డికాక్ రన్ కోసం ప్రయత్నించగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్‌ను గిరాటేశాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో క్వింటన్ డికాక్ వరుసగా విఫలమయ్యాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లలో 1, 23, 7, 0, 0 స్కోర్లు నమోదు చేశాడు. ఎట్టకేలకు ముల్లాన్‌పుర్ టీ20 మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం అతడు మరింత రెచ్చిపోయాడు. ఈజీగా సెంచరీ చేసేలా కనిపించినా.. అనుకోని విధంగా రనౌట్ అయ్యాడు. డికాక్ చెలరేగడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
