PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత

  • డెన్మార్క్ క్రీడాకారిణిపై వరుస గేమ్‌లలో విజయం
  • 21-12, 21-14 తేడాతో ఫైనల్‌లో సింధు గెలుపు
  • హైలో ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు
  • రూ.30 లక్షలకు పైగా ప్రైజ్‌మనీ సొంతం
Pv Sindhu

Pv Sindhu

జర్మనీలోని సార్‌బ్రుకెన్ వేదికగా జరిగిన ‘హైలో ఓపెన్ 2026’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో డెన్మార్క్‌కు చెందిన లైన్ కేర్స్‌ఫెల్ట్‌ను 21-12, 21-14 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో హైలో ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు పుటలకెక్కింది. గతంలో పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు టైటిళ్లు లభించినప్పటికీ, మహిళల సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన ఘనత మాత్రం సింధుకే దక్కింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, ప్రత్యర్థి కేర్స్‌ఫెల్ట్‌కు కోర్టులో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మొదటి గేమ్‌లో 11-8 ఆధిక్యంతో బ్రేక్‌కు వెళ్లిన సింధు, ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి 21-12తో సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ అదే వేగాన్ని కొనసాగిస్తూ పవర్ ఫుల్ స్మాష్‌లు, పక్కా డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి 21-14తో మ్యాచ్‌ను ముగించింది. ఈ ఘనవిజయంతో సింధు సుమారు 35,000 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 30 లక్షలకు పైగా) ప్రైజ్ మనీని అందుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత యువ ఆటగాడు లక్ష్య సేన్, ఇండోనేషియాకు చెందిన స్టార్ ప్లేయర్ జోనాథన్ క్రిస్టీతో టైటిల్ పోరులో తలపడనుండటంతో టోర్నీలో డబుల్ ధమాకా విజయంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.