Pragyan Ojha About Virat Kohli Form: ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై ఈమధ్య ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే! కోహ్లీ టైం అయిపోయిందని, అతడ్ని జట్టు నుంచి తొలగించే సమయం వచ్చేసిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతనికి రోహిత్, రాహుల్ ద్రవిడ్ సహా పలువురు మాజీలు మద్దతుగా నిలిచారు. విదేశీ ఆటగాళ్లు కూడా కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. తాజాగా భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కోహ్లీకి బాసటగా నిలిచాడు. విండీస్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వకుండా.. కోహ్లీని ఆడిపిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘‘దాదాపు పదేళ్లపాటు విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు సాధించాడు. ఇలా రాణించిన ఆటగాళ్లు చాలా అరుదు. అందుకే.. కోహ్లీకి రోహిత్, రాహుల్ సహా జట్టు యాజమాన్యం మద్దతుగా నిలిచింది. కోహ్లీ ఫామ్‌లోకి వస్తే, అతడ్ని ఆపడం ఎవరివల్లా కాదు. కోహ్లీ లాంటి ఆటగాడు టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్ బరిలోకి దిగితే.. ప్రత్యర్థి జట్లు వెనకడుగు వేయాల్సిందే. అతను ఫామ్‌లోకి రావడమే కీలకం. అయినా.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కోహ్లీ నైపుణ్యం గురించి కాదు. అతని మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చూడాలి. విరామం ఇవ్వకుండా, కోహ్లీని ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తేనే బెటర్. అతడ్ని విండీస్ సిరీస్‌కి ఎంపిక చేస్తే బాగుండేది’’ అని ఓజా చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా.. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరుజట్ల మధ్య హోరాహోరా పోరు సాగగా.. మూడో మ్యాచ్ మాత్రం పూర్తిగా వన్‌సైడ్ అయ్యింది. భారత బౌలర్లు విండీస్ బ్యాట్స్మన్లకు చుక్కలు చూపించడంతో.. 137 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇప్పుడు శుక్రవారం నుంచి జరగబోయే టీ20 సిరీస్‌లోనూ అదే జోష్‌తో దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది.
