Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ పదవి బాధ్యతల నుంచి రమీజ్ రాజాను తప్పించి నజమ్ సేథీకి మళ్లీ ఆ బాధ్యతలు అప్పగించారు.
Read Also: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..
కాగా రషీద్ పాకిస్థాన్ తరఫున 23 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. 2015 నుంచి 2016 వరకు పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశాడు. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్ మేనేజ్‌మెంట్ కమిటీలోనూ కీలక మెంబర్‌గా కొనసాగుతున్నాడు. అయితే పీసీబీ చీఫ్‌గా నజమ్ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేసింది. అఫ్రిది వ్యవహారం కూడా ఫలితం ఇవ్వకపోవడంతో పాటు వివాదాలకు కారణమవడంతో అతడిపై కూడా వేటు వేసింది. ఇంత ఆకస్మికంగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్ రషీద్‌కు బాధ్యతలు అప్పగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.