NTV Telugu Site icon

Ramiz Raja: భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు.. బిలీయనీర్ ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లే నయం

Ramiz Raja

Ramiz Raja

Ramiz Raja: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్‌కు చేరింది. అయితే మరో సెమీస్‌లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే ముగ్గురు ఆటగాళ్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారని, ఇది చాలు తామేంటో చెప్పడానికి అంటూ రమీజ్ రాజా గొప్పలు చెప్పుకున్నాడు. ఐపీఎల్‌తో ప్రపంచ మేటి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని గొప్పలు చెప్పుకునే బీసీసీఐ ఇప్పుడేం సమాధానం చెబుతుందని పరోక్షంగా ప్రశ్నించాడు.

Read Also: Team India: అక్కడ టాప్‌గా నిలిస్తే.. కప్పు మాత్రం రాదు.. ఇది పక్కా..!!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పుంజుకున్న తీరు అద్భుతమని రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-12లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా, జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై గెలిచి అనూహ్యంగా సెమీస్ బెర్త్ సాధించింది. అయితే భారత్ మాత్రం సూపర్-12 దశలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా టెస్ట్ సిరీస్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై కూడా రమీజ్ రాజా స్పందించాడు. ఈ సిరీస్‌పై తనకు ఎలాంటి అవగాహన లేదని చెప్పాడు. భారత్-పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశాడు.