ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో అతడి ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది. స్టిర్లింగ్ ఇప్పటివరకు 160 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇదివరకు ఈ రికార్డు భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మరో ఐర్లాండ్ ప్లేయర్ జార్జ్ డాక్రెల్ ఉన్నాడు. డాక్రెల్ ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడాడు. అఫ్గాన్ ప్లేటెర్ మహమ్మద్ నబీ 148 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కీపర్ జోస్ బట్లర్ (144) టాప్-5లో ఉన్నాడు. డాక్రెల్, నబీ ఇంకా ఆడుతున్నారు కాబట్టి రోహిత్ శర్మను దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక టీ20 ఫార్మాట్‌లో స్థిరత్వం, అనుభవానికి ప్రతీకగా నిలిచిన పాల్ స్టిర్లింగ్.. ఐర్లాండ్ జట్టు విజయాల్లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఫిట్‌నెస్, ఫామ్‌ను నిలబెట్టుకుంటూ.. అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం ఆడుతూ ఈ ఘనత సాధించాడు.
పాల్ స్టిర్లింగ్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 2007 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎడిషన్లలో రోహిత్ శర్మ ఆడాడు. బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ అరుదైన ఘనతను సాధించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నారు. 2026లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్ స్టిర్లింగ్ ఆడితే.. అతడూ 9 టీ20 వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రోహిత్, షకీబ్ సరసన నిలవనున్నాడు. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ టీ20 క్రికెట్‌లో కూడా స్టిర్లింగ్ పేరు శాశ్వతంగా నిలిచేలా ఈ రికార్డులు మారనున్నాయి. స్టిర్లింగ్ కెరీర్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
