Site icon NTV Telugu

Australia Cricket: మాకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!

Pat Cummins, Virat Kohli

Pat Cummins, Virat Kohli

Pat Cummins About Australia Elimination in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి మాజీ ఛాంపియన్‌, క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు శాసించిన ఆస్ట్రేలియా నిష్కమించింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌.. ఎవరూ ఊహించని రీతిలో మెగా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై గెలిచినా ఆస్ట్రేలియాకు పెద్దగా ఉపయోగం లేదు. పసికూన ఐర్లాండ్‌పై గెలిచిన ఆసీస్.. శ్రీలంక, జింబాబ్వేపై దారుణంగా ఓడింది. ముఖ్యంగా పసికూన జింబాబ్వేపై ఓటమితో ఆస్ట్రేలియాపై విమర్శలు ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ వైఫల్యంపై ఆ దేశ మాజీలు, క్రికెటర్లు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో మంచి ఆరంభాలు లేకపోవడమే ప్రధాన లోపమని స్పష్టం చేశాడు. ‘పాట్.. ఆస్ట్రేలియాకు ఇది గొప్ప టోర్నమెంట్ కాదు. కానీ జింబాబ్వే మ్యాచ్‌ను ఛేదించవచ్చని మీరు అనుకుంటున్నారా?’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘నిజాయితీగా చెప్పాలంటే.. టీ20 క్రికెట్‌లో ఓపెనింగే మ్యాచ్ విజయంను శాసిస్తుంది. ఓపెనర్లు రాణిస్తే మ్యాచ్ దాదాపు పూర్తవుతుంది. మా ఓపెనర్లు ఈ టోర్నమెంట్లో రాణించలేదు. బలమైన ఆరంభ భాగస్వామ్యం లేకపోవడమే మా కూటములకు కారణం’ అని కమిన్స్‌ బదులిచ్చాడు.

Also Read: Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్‌ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘జింబాబ్వే మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. పవర్ ప్లేలోనే కీలక వికెట్స్ పడ్డాయి. ఒక దశలో మాకు 18 బంతుల్లో 48 పరుగులు అవసరం. ఆ లక్ష్యాన్ని సాధించడం సాధారణ బ్యాటర్‌కు సాధ్యం కాదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప ఏ బ్యాట్స్‌మన్ కూడా సాధించలేడు. మాకు కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు’ అని పాట్‌ కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. 2022 అక్టోబర్‌ 22న పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను కమిన్స్ గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిదని, అలాంటి ఆటను మరో ఆటగాడు పునరావృతం చేయడం చాలా కష్టం అని అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా కమిన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ 2026కు దూరమైన విషయం తెలిసిందే.

Exit mobile version