ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నిన్నటిదాకా భారత్ నాలుగో స్థానంలో ఉండేది. కానీ.. పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌ను వెనక్కు నెట్టేసి, ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా పాక్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో, మొత్తంగా 106 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ నాలుగో స్థానానికి ఎగబాకింది. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యింది. తొలి మూడు స్థానాల్లో న్యూజీలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 125, 124, 107 పాయింట్లతో ఉన్నాయి.
అయితే.. భారత్‌ను వెనక్కు నెట్టామన్న పాకిస్తాన్ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. భారత్ త్వరలోనే ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో వన్డేన సిరీస్‌లలో తలపడనుంది. ఆ రెండు సిరీస్‌లలోనూ పైచేయి సాధిస్తే, భారత్ ఖాతాలో పలు పాయింట్లు వచ్చి చేరుతాయి. ఫలితంగా, టీమిండియా పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టేయొచ్చు. అటు, ఆస్ట్రేలియా కూడా 107 పాయింట్లతోనే మూడో స్థానంలో ఉంది కాబట్టి, దాన్నీ వెనక్కు నెట్టే ఆస్కారం ఉంది. ఆ రెండు సిరీస్‌లలో భారత్ నెగ్గితే, మూడో స్థానానికి ఎగబాకడం ఖాయం!
ఇదిలావుండగా.. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు ముగియగా, ఆ రెండూ భారత్ ఓడిపోయింది. ఈరోజు విశాఖపట్నంలో మూడో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ నెగ్గాలంటే, భారత్ ఇకపై వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, భారత ఆటగాళ్లు ఎలాగైనా గెలవాలని కసి మీదున్నారు.