Paddy Upton Wont Do Wonders Says Sreesanth: టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా నియమితుడైన ప్యాడీ ఆప్టన్‌పై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని వల్ల భారత జట్టుకి ఒరిగేదేమీ లేదని కుండబద్దలు కొట్టాడు. ఒకవేళ టీమిండియా టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే.. ఆ ఘనత కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్లకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు. ఆప్టన్‌కి అద్భుతాలు సృష్టించడం చేతకాదని, అతని వల్ల ఆటగాళ్లకు ఎలాంటి ప్రయోజనమూ లేదని బాంబ్ పేల్చాడు.
‘‘ప్యాడీ ఆప్టసన్ అద్భుతాలేమీ చేయలేడు. ఒకవేళ భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే.. అది కేవలం మన ఆటగాళ్ల ప్రదర్శన, రాహుల్ భాయ్ అనుభవం వల్లే! మనకు పటిష్టమైన జట్టు ఉంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి భారత జట్టుతో ఉన్నా, లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అంటూ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. 2011 నాటి ప్రపంచకప్ విజయంలో అప్టన్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని, 99 శాతం పనిని పూర్తి గ్యారీ కిర్‌స్టన్ అని తెలిపాడు. ఆప్టన్ ఆయనకు అసిస్టెంట్ మాత్రమేనని.. రాజస్తాన్ రాయల్స్‌లో భాగంగా రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే, మళ్లీ టీమిండియా సిబ్బందిలో చోటు దక్కిందన్నాడు. అతడో యోగా టీచరని, ఆ సేవల్ని రాహుల్ భాయ్ కచ్చితంగా వాడుకుంటాడని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.
కాగా.. గతంలో శ్రీశాంత్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 2013 సీజన్‌లో భాగంగా శ్రీశాంత్‌తో పాటు ద్రవిడ్, అప్టన్ కూడా ఈ ఫ్రాంఛైజీ తరఫున పనిచేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్, ద్రవిడ్-అప్టన్ ద్వయం మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆరోజుల్లో వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఆప్టన్ తన ఆటోబయోగ్రఫీలోనూ ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సమయంలో.. తుది జట్టులో చోటు దక్కలేదని తనని, ద్రవిడ్‌ను అసభ్య పదజాలంతో శ్రీశాంత్ దూషించాడని అందులో రాశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.