T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు మరోసారి ప్రపంచకప్‌లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెలోబోర్న్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు విక్రయానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయినట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు.
Read Also: Ravi Shastri: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. గంగూలీకి పరోక్షంగా రవిశాస్త్రి చురకలు
మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో 90వేల మంది కూర్చునేలా సీట్ల కెపాసిటీ ఉందని.. ఈ మొత్తం టిక్కెట్లను విక్రయానికి ఉంచగా అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. మరిన్ని టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయాన్ని పసిగట్టి స్టేడియంలో నిలుచుని మ్యాచ్‌ని తిలకించే విధంగా కొన్ని అదనపు టికెట్లను విడుదల చేయగా ఈ టికెట్లు కూడా కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్లు వివరించారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కౌంటర్లలో సోల్డ్ అవుట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఇప్పటివరకు 6 లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. అటు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న గ్రూప్ స్టేజీలో శ్రీలంక, నమీబియా, యూఏఈ, వెస్టిండీస్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ తలపడనున్నాయి.
