క్రికెట్ చరిత్రలో అప్పుడప్పుడు చెత్త రికార్డులు నమోదవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. హేమాహేమీలు ఎన్నోసార్లు తడబడటం, పెద్ద పెద్ద జట్లు కూడా కొన్నిసార్లు పేలవ ప్రదర్శనతో నిరాశపర్చడం లాంటివి క్రికెట్ హిస్టరీలో ఎన్నో సందర్భాలున్నాయి. అయితే, తాజాగా నమోదైన రికార్డ్ మాత్రం అత్యంత చెత్తది. అసలు ఇలాంటి రికార్డ్ నమోదు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ అదేంటి? అని అనుకుంటున్నారా! పదండి, మేటర్లోకి వెళ్లి తెలుసుకుందాం!
శనివారం నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య అండర్-19 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఇక్కడిదాకా వచ్చాయంటే, ఆ రెండు జట్లు ఎంత బలమైనవో, ఎంత మంచి ప్రదర్శన కనబర్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. అత్యంత కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్లు రెచ్చిపోతాయని అంచనాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ, ఆ అంచనాల్ని మరీ దారుణంగా బోల్తా కొట్టేసి నేపాల్ జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. దీంతో, క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా నేపాల్ నిలిచింది.
నేపాల్ తరఫున బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన బ్యాటర్లలో ఆరుమంది ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. నేపాల్ తరఫున స్నేహా మహారా ఒక్కతే 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. యూఏఈ బౌలింగ్ విషయానికొస్తే.. మహికా గౌర్ నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి, 5 వికెట్లు పడగొట్టింది. ఇక 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 1.1 ఓవర్లలోనే చేధించింది. కాగా.. అంతకుముందు ఖతార్‌తో ఆడిన నేపాల్ ఆ జట్టుపై ఏకంగా 79 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. అలాంటి జట్టు.. 8 పరుగులకే కుప్పకూలడం నిజంగా దారుణం.