T20 World Cup: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మళ్లీ మునుపటి కోహ్లీ కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అలాంటి దశ నుంచి కోహ్లీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే స్థాయికి ఎదిగాడు. అయితే గురువారం నెదర్లాండ్స్‌తో భారత్ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది.
Read Also: ICC Rankings: పాకిస్థాన్‌తో ఒక్క ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
ఈ సందర్భంగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ అదే ఆటతీరు రిపీట్ చేయాలని తాము మాత్రం కోరుకోవడం లేదని స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్ ఓ విధ్వంసం లాంటిదని అభివర్ణించాడు. కోహ్లీ శక్తి సామర్థ్యాలు, దూకుడుకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా నిలిచిందని చెప్పాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో తాము గెలుస్తామని ఎలాంటి అంచనాలు లేవని.. అందుకే తాము ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు. అయితే గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడమే తమ చేతుల్లో ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఆడటం వల్ల తమ జట్టుకు మంచి అనుభవం లభిస్తుందని, ఎందరో స్టార్ క్రికెటర్లతో ఆడటం తమ జట్టుకు మేలు చేస్తుందని స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు
