Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!

Musheer Khan Record

Musheer Khan Record

Musheer Khan Record: టీమిండియా యువ క్రికెటర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్యానాతో జరుగుతున్న ఎలైట్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బంతితోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ తీసి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ముంబై ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. గతంలో 1990-91 సీజన్‌లో టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రవిశాస్త్రి ఈ ఘనత సాధించాడు.

ముంబైలోని బీకేసీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులు చేసింది. ముషీర్‌ ఖాన్‌ 185 బంతుల్లో 109 రన్స్ చేశాడు. అంగ్క్రిష్ రఘువంశీ (114) సెంచరీ చేయగా.. తనుష్ కోటియన్ (52) హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హర్యానా.. ముషీర్‌ స్పిన్‌ ధాటికి తడబడింది. 31 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. హర్యానా తొలి ఐదు వికెట్లను ముషీర్‌ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబైకి 160 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రత్యర్థిపై ఫాలోఆన్‌ విధించిన ముంబై.. వరుసగా మూడో విజయాన్ని బోనస్‌ పాయింట్‌తో సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అధిగమించాలంటే హర్యానా మరో 87 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అయితే పిచ్‌ క్రమంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో చివరి రోజు బ్యాటర్లకు పరీక్ష ఎదురుకానుంది. ముంబై స్పిన్నర్లు బంతి ఎక్కువగా బౌన్స్‌ అయ్యే ప్రాంతాల్లో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ముషీర్‌ ఖాన్‌ తెలిపాడు. పిచ్‌ వేగం బాగా తగ్గిందని, బంతి టర్న్‌ కూడా లభిస్తోందని వివరించాడు. హర్యానా తరఫున నిశాంత్‌ సింధు అద్భుతంగా పోరాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 251 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.