Mumbai Indians Playoff Chances: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఎదురైన ఘోర పరాజయం ముంబై ఇండియన్స్ (MI) ప్లేఆఫ్స్ ఆశలను చిదిమేసింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. 11 ఓవర్లలోనే 100 పరుగులు దాటి, ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ముంబై, చివరకు 159 పరుగులకే పరిమితమై చేతులెత్తేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, నమన్ ధీర్ (57) పోరాటం వృథా అయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో చెన్నై ఈ లక్ష్యాన్ని అతి సులువుగా ఛేదించింది.
ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే ముందున్న దారి చాలా కఠినమైనది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం వారి అవకాశాలను మరింత క్లిష్టం చేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఐదు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి.
ఒక్క మ్యాచ్‌లో ఓడినా వారి ప్రయాణం అధికారికంగా ముగిసిపోతుంది. ఇక, మే 10న రాయ్‌పూర్‌లో బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధరమ్శాలలో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (మే 20), రాజస్థాన్ రాయల్స్ (మే 24) వంటి జట్లతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఐదింటిలో గెలిచి రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాలి. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.
మరోవైపు, ఈ సీజన్ మొత్తంలో ముంబైని వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం. ముఖ్యంగా 10 ఓవర్ల తర్వాత ముంబై బ్యాటర్లు పూర్తిగా తడబడుతున్నారు. పవర్‌ప్లేలో మంచి పునాది పడుతున్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో వికెట్లు సమర్పించుకోవడం ఆనవాయితీగా మారింది. చెన్నైతో మ్యాచ్‌లోనూ 11 ఓవర్లలో 100 పరుగులతో 180కి పైగా స్కోరు చేసేలా కనిపించిన జట్టు, తర్వాతి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌలింగ్ విభాగం అప్పుడప్పుడు రాణిస్తున్నా, బ్యాటర్లు తగినంత స్కోరు బోర్డుపై ఉంచకపోవడం బౌలర్లపై ఒత్తిడి పెంచుతోంది.
