MS Dhoni-CSK: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!

Ms Dhoni Return Ipl 2026

Ms Dhoni Return Ipl 2026

MS Dhoni to Take Final Call on CSK New Head Coach: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) కొత్త హెడ్ కోచ్‌ ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌.. ఇటీవల ఫ్రాంచైజీతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం సీఎస్‌కే అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పలువురు మాజీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే కొత్త కోచ్‌ ఎంపికలో లెజెండ్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

కొత్త కోచ్ ఎంపిక బాధ్యత ధోనీదే:

కొత్త హెడ్ కోచ్‌ విషయంలో సీఎస్‌కే తొందరపడటం లేదని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్‌గా విదేశీ కోచ్‌నే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కోచ్‌ నియామక ప్రకటన అక్టోబర్‌ తర్వాతే రానుంది. విదేశీ కోచ్‌ ఎంపిక ప్రక్రియను ధోనీ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడట.

తెరపైకి స్టార్ మాజీ క్రికెటర్ల పేర్లు:
స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు వారసుడిగా పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ వంటి పేర్లు సీఎస్‌కే కోచ్‌ రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత మాజీలు రాహుల్ ద్రవిడ్‌, హేమంగ్ బదానీ పేర్లు కూడా ఈ రేసులో వినిపించాయి. అయితే విదేశీ కోచ్‌ను నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్రవిడ్‌, బదానీలకు అవకాశం లేనట్టే.

మైక్ హస్సీకి కూడా అవకాశం:
సీఎస్‌కేతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైక్ హస్సీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాడిగా సీఎస్‌కే తరఫున సేవలందించిన హస్సీ.. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా జట్టుతో కొనసాగుతున్నాడు. సీఎస్‌కే వాతావరణం, జట్టు పని విధానం, ఆటగాళ్లతో అనుబంధం వంటి అంశాలపై హస్సీకి మంచి అవగాహన ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. గతంలో పలువురు మాజీ క్రికెటర్లు కూడా హస్సీని హెడ్ కోచ్‌గా నియమించాలని సీఎస్‌కేకు సూచించారు.

హార్దిక్ పాండ్యా విషయంలోనూ ధోనీ కీలక పాత్ర:
మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సీఎస్‌కే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై కూడా ఆసక్తికరమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సీఎస్‌కేలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హార్దిక్ సీఎస్‌కేలో చేరే అవకాశం ఉంటే.. ఈ వ్యవహారంలోనూ ధోనీ కీలక పాత్ర పోషించనున్నాడట. కొత్త హెడ్ కోచ్‌ ఎంపికతో పాటు ఆటగాళ్ల విషయంలోనూ సీఎస్‌కే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.