టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ‘మహ్మద్ షమీ’ ఒకడు. అతడి నైపుణ్యం, రికార్డులు అద్భుతం. అయితే ఇటీవలి కాలంలో వరుస గాయాలతో భారత జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 35 ఏళ్ల షమీ.. దేశవాళీల్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్స్ తీస్తూ.. తాను ఉన్నా అంటూ బీసీసీఐ సెలక్టర్లకు హెచ్చరికలు పంపుతున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక షమీని భారత జెర్సీలో చూడలేమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మహ్మద్ షమీ చివరగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఆపై బీసీసీఐ సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. స్వయంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం షమీ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం చేశాడు. ఆపై సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. దేశవాళీల్లో సత్తాచాటుతున్నా త్వరలో జరగనున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌కు పక్కన పెట్టారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక షమీకి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ.
Also Read: Minors Living Together: హైదరాబాద్‌లో ‘మరో చరిత్ర’.. సహజీవనం చేస్తున్న మైనర్లు!
భారత జట్టులో చోటు కోసం మహ్మద్ షమీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2025 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇవ్వరు వరకు 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. దేశవాళీలో షమీ బెంగాల్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయడం షమీ ప్రత్యేకత. మంచి ఫిట్‌నెస్, ఫామ్ ఉన్నా.. ఎందుకో మరి బీసీసీఐ సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. ఇదే కొనసాగితే.. ఇక షమీని భారత జెర్సీలో చూడలేము. చూడాలి మరి ఏం జరుగుతుందో.
