ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదని కైఫ్ అన్నాడు. తన దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి అని స్పష్టం చేశాడు.
సరైన ఆటగాళ్లు లేకుంటే జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్నా టీమ్‌ను గెలిపించలేడని.. బలహీనమైన సైనికులతో బలమైన రాజు యుద్ధం ఓడినట్లే ఉంటుందని కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉందన్నాడు. మెగా వేలంలో ముంబై జట్టు మేనేజ్‌మెంట్ సరైన బౌలర్లను కొనుగోలు చేయడంలో తమ మార్క్ చూపించలేకపోయిందని కైఫ్ ఆరోపించాడు.
కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను ఓడిపోయింది. బౌలింగ్‌లో బుమ్రాను మినహాయిస్తే చెప్పుకోదగ్గ బౌలర్లు కనిపించడం లేదు. టైమల్ మిల్స్ ఉన్నా నిలకడగా వికెట్లు తీయడం లేదు. అయితే మూడు ఓటములతోనే ముంబై జట్టు నిరాశపడాల్సిన అవసరం లేదు. గతంలో వరుసగా ఐదారు మ్యాచ్‌లు ఓడినా కూడా ముంబై టైటిల్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. గత సీజన్‌లో 6, 7 మ్యాచ్‌లు గెలిచినా జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేవి. కానీ ఈ సీజన్‌లో 8 నుంచి 9 మ్యాచ్‌లు గెలిచినా టాప్ 4లో నిలవడం కష్టమే. ఇది ముంబైకి మరో సవాల్ అని కైఫ్ అన్నాడు.