Site icon NTV Telugu

Marykom: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కామన్వెల్త్ ఆశలు ఆవిరి

Mary

Mary

ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల కోసం భారత బాక్సింగ్‌ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్‌ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్‌ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్‌ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్‌.. బౌట్‌ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల మేరీకోమ్‌ తొలి రౌండ్‌లోనే పడిపోయింది. అయినా, బౌట్‌ కొనసాగించింది. కానీ వరుస పంచ్‌లతో ఎడమ కాలు సమన్వయం కోల్పోయింది. పడిపోయిన మేరీకోమ్‌ను రింగ్‌ నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లగా.. హర్యానా బాక్సర్‌ నితూను రిఫరీ విజేతగా ప్రకటించాడు.
అనంతరం సిబ్బంది సాయంతో మేరీ రింగ్‌ నుంచి బయటకు వెళ్లింది. స్కానింగ్‌ కోసం తనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీ కెరీర్‌పై ఈ గాయం ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత ఆమె బరిలో దిగిన తొలి బౌట్‌ ఇదే. పోరు మొదలైన కొన్ని నిమిషాల్లోనే కిందపడ్డ ఆమెకు గాయమవడం తనకు వయసు మీద పడుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమెకు అయిన ఈ మోకాలి గాయం మేరీ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

IPL Media Rights: ఐపీఎల్ బిడ్డింగ్ రేసు నుంచి అమెజాన్, గూగుల్ అవుట్

ఇక, 50 కిలోల విభాగంలో తెలుగమ్మాయి, నయా వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ సెమీస్‌లో 7-0తో అనామికపై నెగ్గి ఫైనల్‌ చేరింది. పంచ్‌లతో చెలరేగిన నిఖత్‌.. ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించింది. శనివారం జరగబోయే ఫైనల్‌లో మీనాక్షితో నిఖత్‌ తలపడనుంది. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే నిఖత్‌కు కామన్వెల్త్‌ బెర్త్‌ ఖాయమవుతుంది.

Exit mobile version