Lalit Modi about 2007 T20 World Cup: 2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ భారత క్రికెట్ చరిత్రలో ఒక కీలక మలుపు. ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని యువ భారత జట్టు దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించి.. తొలి టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆ టోర్నీకి ముందు భారత సీనియర్ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌ను అంతగా సీరియస్‌గా తీసుకోలేదని మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ తాజాగా వెల్లడించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన లలిత్ మోడీ.. 2007లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిశానని చెప్పారు.
ఇంగ్లండ్ పర్యటనలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లను తొలి టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలని తాను కోరానని లలిత్ మోడీ వెల్లడించారు. అయితే ఆ సమయంలో చాలామంది ఆటగాళ్లు టీ20 క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ‘టీ20 ఆడమని నేను వేడుకున్నప్పుడు.. ‘ఇది ఏంటి కొత్త ఆట?, మేము చాలా రోజులుగా టూర్‌లో ఉన్నాం. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి’ అంటూ చాలామంది ఆటగాళ్లు నిరాకరించారు. కొందరు దీనిని స్టూపిడ్ గేమ్ అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ పూర్తి స్థాయి సీనియర్ జట్టును కాకుండా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును దక్షిణాఫ్రికాకు పంపింది’ అని లలిత్ మోడీ చెప్పారు.
ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తీక్, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ జట్టును అప్పట్లో చాలామంది ‘బీ టీమ్’గా భావించినప్పటికీ.. చివరకు అదే జట్టు ప్రపంచ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని లలిత్ మోడీ అన్నారు. ఇప్పుడు ఏ ఆటగాడు ప్రపంచ కప్ ఆడనని చెబితే.. అభిమానులు, బోర్డు అధికారులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. ‘నేడు ఏ ప్రపంచ కప్ కైనా భారత జట్టు బదులుగా బీ టీమ్‌ను పంపితే ఎవరూ అంగీకరించరు. కానీ 2007లో అలాంటి పరిస్థితి నిజంగానే ఏర్పడింది’ అని వ్యాఖ్యానించారు.
‘టీ20 క్రికెట్ ప్రారంభ రోజుల్లో భారతదేశంలో పెద్దగా ఆదరణ లేదు. ప్రేక్షకులు లేకపోవడంతో ప్రసారకర్తలు, స్పాన్సర్లు కూడా ఆసక్తి చూపలేదు. అయితే యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువరాజ్ ఆరు సిక్సర్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది’ అని లలిత్ మోడీ తెలిపారు. 2007లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్.. నేడు క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీలలో ఒకటిగా మారింది. ఆ మార్పుకు ధోనీ సేన విజయం, యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు, అలాగే టీ20 ఫార్మాట్‌పై విశ్వాసం ఉంచిన లలిత్ మోడీ వంటి వ్యక్తుల కృషి కీలక కారణాలుగా నిలిచాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
