Site icon NTV Telugu

Common Wealth Games 2022: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. లక్ష్యాన్ని ఛేదించిన లక్ష్యసేన్‌

Lakshya Sen

Lakshya Sen

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ బంగారు పతకాన్ని సాధించాడు. మలేషియా షట్లర్‌పై 19-21, 21-9, 21-16 తేడాతో విజయాన్ని సాధించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మలేషియాకు చెందిన ఎన్జీ జే యోంగ్‌ను ఓడించి భారత షట్లర్ లక్ష్య సేన్ దేశ రెండో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి గేమ్‌లో వెనుకంజ వేసిన ఈ భారత షట్లర్.. అనంతరం పుంజుకుని మిగతా వరుస గేమ్‌ల్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్‌కు మరో పసిడి అందించాడు. ఈ పతకంతో భారత ఖాతాలో 57 పతకాలు (20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. అంతకుముందు మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Common Wealth Games 2022: భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన పీవీ సింధు

లక్ష్యసేన్, అతని మలేషియా ప్రత్యర్థి ఓపెనింగ్ గేమ్‌ను చాలా వరకు సమానంగా ప్రారంభించారు. సేన్ 5-4 ఆధిక్యంతో స్వల్ప ప్రయోజనం పొందాడు. కానీ జే యోంగ్ మాత్రం గేమ్‌పై పట్టు వదులుకోలేదు, అతను పాయింట్లు సాధించడమే కాకుండా, సేన్ తన సొంత పాయింట్ల కోసం కష్టపడేలా చేశాడు. సేన్ పోరాడుతూనే చివరికి 19-19తో నిలిచాడు. కానీ 19-21తో భారత ఆటగాడిని అధిగమించిన తర్వాత జే యోంగ్ మొదటి గేమ్‌ను దక్కించుకున్నాడు. తదుపరి గేమ్ కూడా సమాన పోటీగా ప్రారంభమైంది. మొదటి జే యోంగ్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. తర్వాత లక్ష్యసేన్‌ పట్టుదల వల్ల 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. లక్ష్యసేన్ రెండో గేమ్‌ను 21-9 తేడాతో గెలిచి ఉత్కంఠను నెలకొల్పాడు. డిసైడర్ గేమ్ కూడా ఉత్తేజకరమైన రీతిలో ప్రారంభమైంది, ఇద్దరు ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. సేన్ ఈసారి మెరుగ్గా ఉన్నాడు. గేమ్ సగం వరకు అతను 11-7 ఆధిక్యాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం అది 15-11కి పెరిగింది. సేన్ చివరికి మూడో గేమ్‌లో 21-16 తేడాతో తన విజయాన్ని సొంతం ృచేసుకున్నాడు. వరుస రెండు గేమ్‌లను గెలిచి స్వర్ణాన్ని సాధించాడు.

ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించి.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో పీవీ సింధు తన కెరీర్‌లో మొట్టమొదటి కామన్‌వెల్త్ మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని అందుకుంది. ప్రత్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ.. సింధు మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. మిచెల్‌ లీపై 21-15, 21-13 తేడాతో వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి ఫైనల్‌లో బంగారు పతకాన్ని పీవీ సింధు కైవసం చేసుకుంది.

Exit mobile version