NTV Telugu Site icon

SRH vs KKR : ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. పోరాడి ఓడిన సన్ రైజర్స్

Srh Vs Kkr

Srh Vs Kkr

ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో కేకేఆర్ 5 పరుగుల తేడాతో ఎస్ ఆర్ హెచ్ పై గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ లతో 46 పరుగులు ), నితీశ్‌ రాణా (31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు ) రాణించారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్‌రమ్‌ (40 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు ), క్లాసెన్‌ (20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 36 పరుగులు) రాణించినా ఫలితం దక్కలేదు.

Also Read : Heat Movie Review: హీట్

ఒక్కరూ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడకపోయినా… కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. మార్కో జాన్సెన్‌ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (7)లను అవుట్‌ చేసి ప్రత్యర్థి జట్టుని దెబ్బ తీశాడు. జేసన్‌ రాయ్‌ (19 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు ) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్‌ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్‌ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్‌రమ్‌ అద్భుతమైన క్యాచ్‌కు రాణా పెవిలియన్ బాట పట్టాడు.. ఆండ్రీ రసెల్‌ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్‌ చివర్లో కూడా కేకేఆర్‌ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు కేవలం 42 పరుగులే సాధించింది.

Also Read : NTR30: ఏవయ్యా.. కొరటాల.. సినిమా తీస్తున్నావా.. ? సీరియల్ తీస్తున్నావా..?

ఛేదనలో రైజర్స్‌ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (18), అభిషేక్‌ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్‌ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్‌ (0) వికెట్లను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్పోయింది. అయితే మార్క్‌రమ్, క్లాసెన్‌ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు పరుగులు చేశారు. తన తొలి ఫోర్‌ కొట్టేందుకు మార్క్‌రమ్‌ 23 బంతులు తీసుకున్నా… అనుకూల్‌ రాయ్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్‌ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్‌ వెనుదిరిగాడు. అయితే మార్క్‌రమ్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు సన్ రైజర్స్‌ హైదరాబాద్ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్‌ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన స్కోర్ ఛేదించలేకపోయారు. చివర్లో అబ్దుల్ సమద్‌ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకుండా పోయింది.

Show comments