టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడు అని పేరుంది. మైదానంలోనూ, బయటా ఎప్పుడూ సంయమనంతో కనిపించే రాహుల్.. కోపం తెచ్చుకోవడం చాలా అరుదు. సహచర ఆటగాళ్లపై అరిచిన దాఖలాలు లేవు. అయితే పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో వరుసగా ఎదురైన చేదు ఓటములు అతడిని తీవ్ర నిరాశకు గురి చేశాయని మాజీ భారత క్రికెటర్, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ వెల్లడించాడు. తీవ్ర నిరాశలో ఉన్న రాహుల్ సహచర ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడట.
దూరదర్శన్‌లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశాడు. ‘కేఎల్ రాహుల్ సహజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. తన పనిని తాను చూసుకునే వ్యక్తి. మైదానంలోనైనా, బయటైనా అతడు కోపం ప్రదర్శించడం చాలా అరుదు. కానీ పంజాబ్ తరఫున నేను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో దాదాపు ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లేది. గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా చేజార్చుకునేవాళ్లం. ఒకసారి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎవరినీ తప్పుపట్టలేదు.. కానీ జట్టు ప్రదర్శనపై అతడి నిరాశ స్పష్టంగా కనిపించింది. నేను అతడిని కోపంగా చూసిన ఏకైక సందర్భం అదే’ అని జాఫర్ తెలిపాడు.
2018 నుంచి 2021 వరకు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 2020, 2021 సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. 2020 సీజన్‌లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రాహుల్.. జట్టును మాత్రం ఆరో స్థానంలో నిలిపాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం రెండు పరుగుల తేడాతో పరాజయం పాలవడం పంజాబ్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో గెలిచివుంటే పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశముండేది. చివరకు ఆ జట్టు 12 పాయింట్లతో సీజన్ ముగించగా.. 14 పాయింట్లతో బెంగళూరు నాలుగో ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది.
2021 సీజన్‌లో కూడా పరిస్థితి మారలేదు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో రెండు పరుగుల తేడాతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ మరోసారి ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది. ఆ సీజన్‌లో కూడా పంజాబ్ 12 పాయింట్లతో ముగించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో చివరి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. రాహుల్ మాత్రం 626 పరుగులతో మరో అద్భుతమైన సీజన్‌ను నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ 55 మ్యాచ్‌ల్లో 2,548 పరుగులు చేశాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహించిన రాహుల్.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ మళ్లీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 2026 సీజన్‌లో 593 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిగా తొలి 150+ స్కోరు (152 నాటౌట్) నమోదు చేసి మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు.

