Site icon NTV Telugu

Asia Cup: హాంకాంగ్‌తో మ్యాచ్‌ నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పిస్తారా?

Ravichandran Ashwin

Ravichandran Ashwin

Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్‌ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది. ఆ రెండు సార్లు ఇండియానే గెలిచింది.

అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, అవేష్ ఖాన్‌లను ఈ మ్యాచ్‌లో పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ స్థానంలో.. రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. దీంతో రోహిత్, పంత్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించేలా ఆడిన కోహ్లీ కీలక సమయంలో 35 పరుగులు చేయడంతో అతని బెర్త్ ఖాయంగా ఉంది. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. పంత్ తుది జట్టులో ఉంటే జడేజా ఎప్పటిలాగే తన 6వ స్థానంలో బరిలోకి దిగుతాడు. 5వ స్థానంలో పాకిస్థాన్ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. అటు అవేష్ ఖాన్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత్ ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బరిలో దిగనుంది.

Exit mobile version