Site icon NTV Telugu

Mumbai Indians: జట్టు నుంచి పొలార్డ్ తొలగింపు..?

Pollard

Pollard

ముంబై ఇండియన్స్ జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో కీరన్ పొలార్డ్ ఒకడు. ఎన్నోసార్లు జట్టు ఆపదలో ఉన్నప్పుడు నెట్టుకురావడమే కాదు, కొన్నిసార్లు ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన ఘనత అతని సొంతం. అవసరమైనప్పుడల్లా బ్యాట్‌కి పని చెప్పడమే కాదు, బంతితోనూ మాయ చేయగలడు. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే, యాజమాన్యం రూ. 6 కోట్లు వెచ్చించి మరీ అతడ్ని రిటైన్ చేసుకుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా మెరుపులు మెరిపిస్తాడని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఇతను పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 10 మ్యాచుల్లో ఈ కరేబియన్ ఆటగాడు చేసింది 129 పరుగులు. అందులో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 25.

ఈ గణాంకాల్ని బట్టి, పొలార్డ్ ఏమాత్రం ఫామ్‌లో లేడని స్పష్టం చేసుకోవచ్చు. ఫలానా మ్యాచ్‌లో దుమ్ముదులిపేస్తాడని అనుకున్నప్పుడల్లా, తక్కువ స్కోరుకే వెనుదిరుగుతూ నిరాశ పరుస్తున్నాడు. మునుపటిలాగా ఇతడు కీలక రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 14 బంతుల్లో కేవలం 4 పరుగులే చేయడంతో ఆ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా.. మిగిలున్న మ్యాచ్‌లలో పొలార్డ్‌పై వేటు తప్పదని కీలక వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచే అతనికి ఈ సీజన్‌లో ఆఖరిది కావొచ్చని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది నుంచి కూడా ఆడకపోవచ్చని ఆయన బాంబ్ పేల్చాడు.

డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్ లాంటి ఓవర్సీస్ ఆటగాళ్ళు ముంబైలో బాగా రాణిస్తున్నారని.. కాబట్టి ఇకపై పొలార్డ్‌ను ఆడించకపోవచ్చని ఆకాశ్ చోప్రా చెప్పాడు. అసలు టిమ్ డేవిడ్ లాంటి ఆటగాడ్ని ముంబై వాళ్ళు ముందే ఎందుకు జట్టులోకి తీసుకురాలేదని, సిక్సర్ల మెషీన్‌ను పక్కనెందుకు పెట్టారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక నుంచి టిమ్‌ డేవిడ్‌ను తప్పకుండా జట్టులో కొనసాగిస్తారని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. ఇదిలావుండగా.. ఇటీవల కీరన్ పొలార్డ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే! అయితే.. ఫ్రాంచైజీ క్రికెట్, టీ20 లీగ్‌లు ఆడే విషయమై పొలార్డ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Exit mobile version