Site icon NTV Telugu

Indonesia Open: కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్ నిష్క్రమణ

Srikanth

Srikanth

ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే ఊహించని పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-23, 10-21తో 41వ ర్యాంకర్‌ బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు. గతంలో లెవెర్‌డెజ్‌తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్‌ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో షటిల్‌పై శ్రీకాంత్‌కు నియంత్రణ లభించలేదు. అతడి అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి.
మరోవైపు సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 10-21, 9-21తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. లక్ష్య సేన్‌పై ప్రణయ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో అర్జున్‌- ధ్రువ్‌ జోడీ 27-25, 18-21, 21-19తో మత్సుయ్‌- యొషినోరి (జపాన్‌) జంటపై గెలిచింది. ఒక గంటా 23 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీదే పైచేయి అయింది. మహిళల డబుల్స్‌లో అశ్విని భట్‌, శిఖా గౌతమ్‌ జోడీతో పాటు హరిత హరినారాయణన్‌, అశ్న రాయ్‌ ద్వయం పరాజయం చవిచూశాయి.

Exit mobile version