Vaibhav Sooryavanshi: సచిన్‌ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!

  • భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా వైభవ్ సూర్యవంశీ
  • వైభవ్ ప్రతిభపై కపిల్ దేవ్ ప్రశంసలు
  • వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్నవాడు
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Kapil Dev Warns Against Putting Too Much Pressure on Vaibhav: భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్లేయర్ యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’. కేవలం 15 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం.. భవిష్యత్తు భారత స్టార్‌గా ఇప్పటికే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (ఎంవీపీ) అవార్డును కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన భారత 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్.. అతనిపై ఇప్పుడే భారీ అంచనాలు ఉంచడం సరైంది కాదన్నాడు. వైభవ్ భవిష్యత్తును అంచనా వేయడానికి ఇంకా సమయం అవసరమని పేర్కొన్నాడు.

‘వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్నవాడు. కానీ అతను ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అతని ప్రపంచం మొత్తం క్రికెట్ మాత్రమే. వైభవ్ వయసు ఇప్పుడు 15. 20-22 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత అతని కెరీర్‌ను అంచనా వేయవచ్చు. ప్రతిభ మాత్రం అసాధారణం’ అని కపిల్ దేవ్ చెప్పాడు. అంతేకాకుండా వైభవ్‌ను భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు. ’16 ఏళ్ల వయసులో సచిన్ ఎలా ఆడాడో, వైభవ్ కూడా అలాంటి ప్రతిభను కలిగి ఉన్నాడు. కానీ సచిన్‌లా చాలా కాలం పాటు నిలకడగా రాణించగలడా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అతడు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని చెప్పాడు.

వైభవ్‌పై అధిక అంచనాలు పెట్టుకోవద్దని కపిల్ దేవ్ ఇదివరకు కూడా సూచించాడు. యువ ఆటగాడికి గౌరవం ఇవ్వడం తప్పు కాదని, కానీ అతను జాతీయ జట్టులోకి కొత్తగా వచ్చిన ఈ దశలో అతని నుంచి అద్భుతాలు ఆశించడం సరికాదని పేర్కొన్నాడు. ‘క్లబ్ క్రికెట్ ఆడటం వేరు, దేశం కోసం ఆడటం వేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి, బాధ్యతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అతనికి సమయం ఇవ్వాలి. వెంటనే భారీ అంచనాలు పెట్టి ఒత్తిడి తీసుకురావద్దు’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్‌లో కూడా వైభవ్ చెలరేగిపోయాడు. ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ‘ఏ’ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత సీనియర్ టీ20 జట్టుకు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.