Ishan Kishan Double Century On Bangladesh In Third ODI: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు.. ద్విశతకం సాధించాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా.. తొలి ద్విశతకం కూడా! అంతేకాదు.. వన్డే చరిత్రలో ఇది ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. కేవలం 126 బంతుల్లోనే 24 ఫోర్లు, 9 ఫోర్ల సహకారంతో అతడు డబుల్ సెంచరీ చేశాడు. బంగ్లా బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ పరుగుల వర్షం కురిపించాడు. బంగ్లా బౌలర్లపై దండయాత్ర చేశాడు. తొలుత 88 బంతుల్లో సెంచరీ చేసిన ఇతగాడు.. ఆ తర్వాత మరో వంద పరుగుల్ని 48 బంతుల్లోనే సాధించాడు. ద్విశతకం చేసిన జోష్‌లో.. పరుగుల వర్షం కురిపించాలని భారీ షాట్లకు ప్రయత్నించాడు. ఒక ఫోర్, మరో సిక్స్ కొట్టగలిగాడు కానీ, ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఐదో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించగా.. అది గాల్లో ఎగిరింది. స్ట్రెయిట్‌గా సిక్స్ లైన్ వైపు దిశగా దూసుకెళ్లింది. కానీ, ఎక్కువసేపు గాల్లోనే బంతి ఉండటంతో, సరిగ్గా లైన్ వద్దకు ఫీల్డర్ చేరుకొని, బంతిని తన చేతికి అందుకున్నాడు. దీంతో.. 210 (131) పరుగుల వద్ద ఇతడు ఔటయ్యాడు.
ఇషాన్ చేసిన డబుల్ సెంచరీతో స్టేడియం మొత్తం హోరెత్తింది. మాజీలు, ఆటగాళ్లు, స్టేడియంలో ఉన్న అభిమానులందరూ.. అతనికి స్టాండింగ్ ఒవేషన్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంతసేపు.. స్టేడియం మొత్తం కేకలు, అరుపులే! అతడు ఆడుతున్నంతసేపు.. ఓ పండుగ వాతావరణంలా స్టేడియంలో సందడి నెలకొంది. బ్యాట్ ఎత్తితే చాలు.. సిక్స్, లేదా ఫోర్స్ రూపంలో బౌండరీలు బాదడంతో, ఇది టీ20ని తలపించింది. ఇతడు ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. సిరీస్ ఓడిపోయిన బాధ మాయమైందని చెప్పుకోవచ్చు.