Yuvraj Singh: భారత క్రికెట్ మాజీ విధ్వంసకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన యువీ.. ఇప్పుడు కోచ్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు.. సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌తో యువరాజ్‌కు స్వాగతం పలికింది.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు విజయాల్లో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మైదానంలో తనదైన దూకుడుతో గుర్తింపు పొందిన యువీ.. ఇప్పుడు కోచింగ్ రంగంలోకి అడుగుపెడుతుండటం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యువరాజ్‌కు పాత అనుబంధం
యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో గతంలోనూ అనుబంధం ఉంది. 2015లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు యువరాజ్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువరాజ్ నిలిచారు. ఇప్పుడు ఆటగాడిగా కాకుండా కోచ్‌గా అదే ఫ్రాంచైజీతో మరోసారి కలిసి పనిచేయనున్నారు.
సౌరవ్ గంగూలీతో కలిసి పనిచేసే అవకాశం
యువరాజ్ సింగ్ కొత్త బాధ్యతల్లో భాగంగా సౌరవ్ గంగూలీతో కలిసి పనిచేయనుండటం మరో ప్రత్యేకత. భారత జట్టులో గతంలో సహచరులుగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు.. ఇప్పుడు కోచింగ్ సిబ్బందిలో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు తమ అనుభవాన్ని అందిస్తూ, జట్టులోని ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయనున్నారు.
యువ బ్యాటర్లకు మార్గదర్శిగా యువరాజ్
ఫ్రాంచైజీ స్థాయిలో యువరాజ్‌కు ఇది తొలి కోచింగ్ అనుభవం అయినప్పటికీ, ఇప్పటికే పలువురు యువ భారత బ్యాటర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచుకుంటూ వారి ఆటతీరును మెరుగుపర్చడంలో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో యువరాజ్‌కు ఉన్న అనుబంధం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.
తొలి ఐపీఎల్ టైటిల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గురి
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. 2020లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన జట్టు.. రాబోయే సీజన్‌లో ట్రోఫీని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌరవ్ గంగూలీతో పాటు యువరాజ్ సింగ్ వంటి అనుభవజ్ఞులు కోచింగ్ సిబ్బందిలో చేరితే జట్టు బ్యాటింగ్ విభాగానికి మరింత బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
A champion. A leader. 𝐀 𝐓𝐢𝐠𝐞𝐫. 🐅🔥
The legend who inspired generations is ready to shape Dilli’s legacy. Welcome home, Yuvi paa! 💙❤️ https://t.co/i7A77rv2tJ
— Delhi Capitals (@DelhiCapitals) October 13, 2026

