Site icon NTV Telugu

Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!

Yashasvi Jaiswal Vs Mi

Yashasvi Jaiswal Vs Mi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో యశస్వి జైస్వాల్ పేరు వినగానే అగ్రెసివ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. ఇన్నింగ్స్ ముందునుంచే బౌలర్లపై విరుచుకుపడడం అతడి శైలి. పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై జైస్వాల్ ప్రదర్శన మరింత భీకరంగా ఉంది. జైస్వాల్ ఇటీవలి గణాంకాలు చూస్తే.. ముంబై బౌలర్లపై ఎలా రెచ్చిపోతున్నాడో స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌పై యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్ ఆడి 373 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అతడి సగటు 53.28గా ఉండగా.. స్ట్రైక్ రేట్‌ 187.43గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే ముంబైపై జైస్వాల్ ఎంత దూకుడుగా ఆడుతున్నాడో అర్థమవుతుంది. ఇటీవల ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. చివరి ఐదు ఇన్నింగ్స్‌లో 124, 10, 104 నాటౌట్, 13, 77 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండడం అతని స్థిరత్వానికి నిదర్శనం. మొత్తానికి ముంబై అంటేనే జైస్వాల్ శివాలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ డామినేషన్ కొనసాగుతుందా? లేక ముంబై బౌలర్లు అతన్ని అడ్డుకుంటారా? అన్నది చూడాలి.

Also Read: Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశస్వి ముందునుంచి రాజస్థాన్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శన ద్వారానే టీమిండియాలోకి వచ్చాడు. ఇప్పటివరకు 70 మ్యాచ్‌లలో 2336 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యశస్వి అత్యధిక స్కోర్ 124.

 

Exit mobile version