Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!

  • ముంబై ఇండియన్స్‌పై చివరి బంతికి ఆర్సీబీ విజయం
  • ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్
  • మేం గెలవడానికి అర్హులం కాదన్న పటీదార్
Rajat Patidar Interview

Rajat Patidar Interview

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ గెలిచినా.. పెద్దగా సంతోషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తాము గెలవడానికి అర్హులు కాదని స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్య ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ఆర్సీబీ కెప్టెన్ ప్రశంసించాడు.

రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. 5.1 ఓవర్లకే 39/3తో కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో ముంబై మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించింది. అయితే ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్య ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆర్సీబీ విజయంలో భువనేశ్వర్‌ కుమార్‌ (4/23), కృనాల్ కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి మ్యాచ్‌లు ఇప్పుడు సాధారణమే అయిపోయాయి. కానీ ఇది చాలా టఫ్ గేమ్. ముఖ్యంగా కృనాల్ పాండ్య అసాధారణంగా ఆడాడు. జట్టును ఒత్తిడిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. కృనాల్‌ను ఐదో స్థానంలో పంపడం జట్టు నిర్ణయమే. అతడికి మంచి అనుభవం ఉంది. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో అనుభవజ్ఞులే జట్టును గెలిపిస్తారు. ముంబై ఇండియన్స్‌ను 166 పరుగులకే పరిమితం చేయడంలో భువనేశ్వర్ కుమార్ పాత్ర కీలకం. ఈ పిచ్‌పై బంతి అద్భుతంగా వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో భువనేశ్వర్ బంతిపై చూపించిన నియంత్రణ అద్భుతం. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం’ అని చెప్పాడు.

మ్యాచ్ గెలిచిన తర్వాత రజత్ పటీదార్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ‘మాకు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. 166 పరుగుల లక్ష్యాన్ని మేం మరింత సులభంగా ఛేదించాల్సింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇలాంటి లక్ష్యాలను ఈజీగా చేధించే సామర్థ్యం మాకు ఉంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో మేం గెలవడానికి అర్హులు కాదు అనిపించింది. సాధారణ లక్షాన్ని చివరి బంతి వరకు తీసుకెళ్లాము. ఈ విజయంతో రెండు పాయింట్స్ వచ్చినా.. పెద్దగా ఆనందం లేదు’ అని పటీదార్ తెలిపాడు. పటీదార్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసులో మరింత బలంగా నిలిచిన బెంగళూరు.. ఇప్పుడు టాప్-2 స్థానంపై దృష్టి పెట్టింది.