Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!

Ms Dhoni Record

Ms Dhoni Record

MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్‌ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే యెల్లో ఆర్మీ ముందడుగు వేస్తుంది.

శుక్రవారం గుజరాత్‌పైతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అభిమానులను అలరించాడు. ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన మహీ కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై ఓడిపోతుందని తెలిసినా.. ధోనీ ఇన్నింగ్స్‌తో అభిమానులు ఆనందపడిపోయారు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మనం ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ స్థానం గురించి చర్చలు ఆపేయాలి. అతడు ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ మీరు చెన్నై గెలవాలని కోరుకుంటే.. ధోనీ ఆడుతున్న స్ట్రైక్‌రేట్‌తో మిగతా చెన్నై ఆటగాళ్లు ఆడాలి. అప్పుడు చెన్నై సులువుగా గెలుస్తుంది’ అని క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ సెహ్వాగ్‌ అన్నాడు.

Also Read: James Anderson Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘స్వింగ్ కింగ్’ జేమ్స్ అండర్సన్!

‘నేను వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎంఎస్ ధోనీ ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే బాగా ఆడాడు. అభిమానులను అలరిస్తున్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే ఫాన్స్ టికెట్‌ కొనుగోలు చేసిన మొత్తానికి ధోనీ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ దొరికినట్లే. భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. చెన్నై విజయం సాధించినా.. ఓడిపోయినా ఆ జట్టు అభిమానులకు అవసరం లేదు. వారికి ధోనీ బాగా ఆడితే చాలు. ప్రేక్షకులు కూడా మహీ ఆటను చూసేందుకే వస్తున్నారు. ధోనీ కూడా వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకే ఆడుతున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.