Virat Kohli IPL Record: భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా మే 26న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం 281 మ్యాచ్‌లతో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టాప్‌లో ఉన్న కింగ్.. గుజరాత్‌పై బరిలోకి దిగగానే 282 మ్యాచ్‌లతో నంబర్-1 ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. దీంతో ఐపీఎల్ 2027 వరకు ఈ రికార్డు విరాట్ పేరిట కొనసాగనుంది.
ఐపీఎల్ 2026 లీగ్ దశతోనే రోహిత్ శర్మ ప్రస్థానం ముగిసింది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో.. హిట్‌మ్యాన్ ఇక ఈ సీజన్‌లో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ 278 మ్యాచ్‌లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ధోనీ నిలిచినా.. ఈసారి కాలి కండరాల గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. దాంతో విరాట్, కోహ్లీలు ధోనీని అధిగమించాడు. కోహ్లీకి ఈ సీజన్‌లో కనీసం మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఓడినా.. క్వాలిఫయర్-2 ద్వారా ఫైనల్‌కు చేరితే కోహ్లీ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దీంతో అతడి రికార్డు మరింత కాలం నిలవనుంది.
2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఒకే ఫ్రాంచైజీకి అన్ని సీజన్లలో ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. 2011 ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీ రిటైన్ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన కోహ్లీ.. అదే ఏడాది తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం 2013లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2016 సీజన్‌లో కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఫైనల్‌కు చేరినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అయితే ఆ సీజన్‌లో విరాట్ అద్భుత ప్రదర్శనతో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2021 తర్వాత కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పాడు. చివరకు 2025లో రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో 281 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 9218 పరుగులతో టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కింగ్ ఖాతాలో 9 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు మరే బ్యాటర్ కూడా 7500 పరుగుల మార్క్‌ను దాటలేకపోయాడు. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు కింగ్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌కి విరాట్ ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.
