Virat Kohli: నాకు చాలా భయం వేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

  • మనసులోని మాట బయటపెట్టిన కింగ్ కోహ్లీ
  • ఐపీఎల్‌లో చాలా ఎక్కువైపోతోంది
  • అసౌకర్యంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli Rcb Podcast

Virat Kohli Rcb Podcast

Virat Kohli RCB Podcast: టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడతాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో తన భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని సూటిగా అడిగినట్లు కొన్ని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. తాజాగా మరో విషయంపై కింగ్ తన మనసులోని మాట బయటపెట్టాడు. సోషల్ మీడియా, గ్లామర్‌కు కాస్త దూరంగా ఉండేందుకు ఇష్టపడే కోహ్లీ.. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రైవసీ దెబ్బతింటోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్ల సమయంలో కెమెరాల హడావుడి ఎక్కువైందని, అది ఆటగాళ్లకు అసౌకర్యంగా మారుతోందని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లపై ఎప్పుడూ కెమెరాలు ఉండటం వల్ల సహజంగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నామని తెలిపాడు. ‘ప్రాక్టీస్‌కు వెళ్తే ఆరు కెమెరాలు వెంట వస్తుంటాయి. అది అసలు కంఫర్ట్‌గా ఉండదు. ఒక ప్లేయర్ ప్రశాంతంగా తన ఆటను ఆడుకునే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇప్పుడు మేము చేసే చేసే ప్రతి దాన్ని షూట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, దానిపై చర్చించడం జరుగుతోంది’ అంటూ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

ప్రాక్టీస్ సమయంలో కొత్త విషయాలు ప్రయత్నించాలన్నా ఇప్పుడు తనకు భయం వేస్తోందని విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘నెట్స్‌లో నేను కొత్తగా ఏదైనా ట్రై చేస్తే.. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. తర్వాత నా ప్రాక్టీస్‌పైనే చర్చ జరుగుతుంటుంది. మ్యాచ్‌లో చేసిన ప్రదర్శన ఆధారంగా నన్ను అంచనా వేయాలి. కానీ నా ప్రిపరేషన్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు’ అని స్పష్టం చేశాడు. ఆటగాళ్లను చిత్రీకరించే విషయంలో కొంత పరిమితి అవసరమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘ఎంతవరకు చిత్రీకరించాలి?, ఎప్పుడు షూట్ చేయాలి?, ఆటగాడు కెమెరాలో కనిపించడానికి సౌకర్యంగా ఉన్నాడా? లేదా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ షూట్ చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువైపోతోంది’ అని తెలిపాడు.

తనకు ఆటలో ఉండే ఒత్తిడి ఇష్టమే కానీ.. సోషల్ మీడియా, కమర్షియల్ ఒత్తిడి మాత్రం నచ్చదని కోహ్లీ కోహ్లీ స్పష్టం చేశాడు. ‘ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్‌కు, జట్ల కమర్షియల్ ప్రమోషన్‌కు సోషల్ మీడియా ముఖ్యమని అర్థం చేసుకుంటా. కానీ దీనికి కూడా ఒక హద్దు ఉండాలి. ఐపీఎల్ మొదలైనప్పుడు సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. అధికారిక ఫ్యాన్ పేజీలు, సోషల్ మీడియా కల్చర్ తర్వాతి కాలంలో పెరిగాయి. అందుకే అప్పట్లో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో ప్రాక్టీస్ చేశారు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్ల ప్రైవసీ, సోషల్ మీడియా ప్రభావంపై మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి.