Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!

  • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ విజయం
  • ఆర్సీబీ విజయంలో కింగ్ కీలక పాత్ర
  • తన కల నిజమైందని చెప్పిన కోహ్లీ
Virat Kohli Emotional Speech

Virat Kohli Emotional Speech

Virat Kohli Gets Emotional After RCB’s IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కింగ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. ఈరోజు త కల నిజమైందని, ఈ విజయాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణంగా అభివర్ణించాడు.

‘ఇలాంటి క్షణాల గురించే ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచే రోజు నేను మైదానంలో ఉండి, విజయం సాధించే పరుగులు కొట్టాలని ఎన్నోసార్లు ఊహించుకున్నాను. ఈరోజు ఆ కల నిజమైంది. ఇది మా జట్టుకు, నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఫైనల్‌కు ముందు మా జట్టంతా చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. మా బలాలు, మా ప్రణాళికలపై పూర్తి నమ్మకం ఉంది. అదే మాకు విజయాన్ని అందించింది’ అని ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

×
×
Ad

ఈ సీజన్‌లో తన అత్యంత వేగవంతమైన ఐపీఎల్ అర్ధశతకం నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆధునిక క్రికెట్ అవసరాలే తన ఆటలో మార్పులకు కారణమని వెల్లడించాడు. ‘ఇప్పటి క్రికెట్ పూర్తిగా మారిపోయింది. యువ ఆటగాళ్లు నిరంతరం మిమ్మల్ని సవాలు చేస్తుంటారు. వారు మీ ఆటను మెరుగుపరుచుకోవాలని, మరింత దూకుడుగా ఆడాలని ప్రేరేపిస్తారు. నేను ఎప్పుడూ నన్ను నేను మెరుగుపరుచుకోవడంలో గర్వపడుతుంటాను. అందుకే నా ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నాను. షాట్లు కొత్తగా నేర్చుకోలేదు కానీ వాటిని మరింత తరచుగా ఆడేందుకు ప్రయత్నించాను’ అని తెలిపాడు.

ఈ సీజన్‌లో తన మైండ్‌సెట్‌ను మార్చుకున్నానని, ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులోని ఉత్తమ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని నిర్ణయించుకున్నానని విరాట్ కోహ్లీ వివరించాడు. ‘నేటి క్రికెట్‌లో అదనంగా 20-30 పరుగులు చాలా తేడా తీసుకొస్తాయి. అందుకే నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. ప్రత్యర్థి జట్టులోని అత్యుత్తమ బౌలర్లపై కూడా దాడి చేయాలనేది నా లక్ష్యం. అదే విధంగా ఆడుతూ జట్టు విజయానికి సహకరించగలిగాను. ఈ విజయానికి నా వంతు పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం అద్భుత ఫామ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ.. ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన ట్రోఫీ విజయాన్ని మరోసారి ఆస్వాదించిన కోహ్లీ.. ఈ విజయాన్ని తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. అభిమానులు కూడా ‘కింగ్ కోహ్లీ’ మరోసారి పెద్ద మ్యాచ్‌లో తన క్లాస్‌ను చూపించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్నటి వరకు ఫైనల్ మ్యాచ్‌లో పెద్దగా ఆడలేదనే విమర్శలను ఎదుర్కొన్న కింగ్.. తాజా ఇన్నింగ్స్‌తో అన్నింటికీ చెక్ పెట్టాడు.