Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌.. 25 బంతుల్లోనే సెంచరీ.. వీడియో వైరల్!

  • వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌
  • 25 బంతుల్లోనే సెంచరీ చేసిన బుడ్డోడు
  • పీటర్సన్ ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్న వైభవ్
Vaibhav Sooryavanshi 25 Ball Century

Vaibhav Sooryavanshi 25 Ball Century

Vaibhav Sooryavanshi 25 Ball Century: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ షోలో సరికొత్త రికార్డు సృష్టించాడు. పీటర్సన్ నిర్వహించిన ప్రత్యేక ఛాలెంజ్‌లో పాల్గొన్న వైభవ్.. కేవలం 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుడ్డోడి బ్యాటింగ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

కెవిన్ పీటర్సన్ తన షోలో వైభవ్‌ సూర్యవంశీకి 50 బంతుల్లో 100 పరుగులు చేయాలని ఛాలెంజ్ విసిరాడు. అయితే బుడ్డోడు ఆ ఛాలెంజ్‌ను చాలా ఈజీగా తీసుకుని.. కేవలం 25 బంతుల్లోనే శతకం బాదేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు బాదుతూ కేపీని షాక్‌కు గురిచేశాడు. వైభవ్ క్యాచ్ పడితే.. వెయ్యి డాలర్లు ఇస్తామని ఫీల్డర్లకు పీటర్సన్ నజరానా ప్రకటించాడు. అయితే ఒక్కరు కూడా ఆ ఆఫర్‌ను వినియోగించుకోలేకపోయారు. ఓ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. వైభవ్ విధ్వంసంకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన వెంటనే పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేశాడు.

అయితే శ్రేయస్ అయ్యర్ రికార్డును మాత్రం వైభవ్‌ సూర్యవంశీ బద్దలు కొట్టలేకపోయాడు. గతంలో ఇదే షోలో పాల్గొన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్.. కేవలం 22 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. పీటర్సన్ షో చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఇప్పటికీ అయ్యర్ పేరిటే కొనసాగుతోంది. వైభవ్ కేవలం మూడు బంతుల తేడాతో ఆ రికార్డును చేజార్చుకున్నాడు. ఈ షోలో భాగంగా పీటర్సన్ మాట్లాడుతూ.. ‘శ్రేయస్ రికార్డును బ్రేక్ చేస్తావా? అని అడగగా’, ఖచ్చితంగా బ్రేక్ చేస్తా అని వైభవ్ చెప్పాడు. కానీ చివరికి మూడు బంతుల తేడాతో ఆ ఘనతను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ పీటర్సన్ షోలో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ 28 బంతుల్లో సెంచరీ చేయగా.. ఏబీ డివిలియర్స్ 30 బంతులు తీసుకున్నాడు. యశస్వీ జైస్వాల్‌కు సెంచరీ పూర్తి చేయడానికి 47 బంతులు కావాల్సి వచ్చింది.

ఇక ఈ ఎపిసోడ్‌లో వైభవ్ సూర్యవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయాలని తన లక్ష్యమని తెలిపాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన గేల్.. పుణె వారియర్స్‌పై 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ రికార్డును బద్దలు కొడతానని వైభవ్ చెప్పుకొచ్చాడు. ‘టీ20ల్లో 200 పరుగులు చేయాలని ఉంది. క్రిస్ గేల్ 175 చేశాడని తెలుసు. ఆ రికార్డును నేను తప్పకుండా బ్రేక్ చేస్తా. మ్యాచ్‌లో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఖచ్చితంగా 200 పరుగులు సాధిస్తా’ అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన ఈ బుడ్డోడు.. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు బద్దలు కొట్టడం పక్కా.