Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఊర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్‌
  • 13 బంతుల్లోనే ఊర్విల్ హాఫ్ సెంచరీ
  • ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Urvil Patel interview

Urvil Patel interview

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊర్విల్ పటేల్ మెరుపు ఆరంభం అందించాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపిస్తూ.. కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 23 బంతుల్లో 65 పరుగులు చేసి సీఎస్‌కే విజయానికి బలమైన పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై యశస్వి కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఊర్విల్ కూడా 13 బంతుల్లో ఫిఫ్టీ చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. యువ ఆటగాడిగా ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఊర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా మనసులో ప్రత్యేకంగా ఏమీ లేదు. మ్యాచ్ పరిస్థితికి, బంతికి తగ్గట్టుగా ఆడాలని మాత్రమే అనుకున్నాను. నాకు స్టేబుల్ బేస్ మెయింటైన్ చేసి షాట్లు ఆడమని కోచ్ చెప్పాడు. నేను అదే చేశాను. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పిచ్ కాస్త నెమ్మదిగా ఉందని, అందుకు సిద్ధంగా ఉండమని చెప్పాడు. అంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పలేదు. నా ఆటను నేనే ఆడేలా స్వేచ్ఛ ఇచ్చాడు. నేను హాఫ్ సెంచరీ చేయడం, చెన్నై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే మ్యాచులలో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఊర్విల్ పటేల్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 203/8 స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్‌కే 19.2 ఓవర్లలో 208/5 స్కోర్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఊర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించింది.