SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!

Natarajan

Natarajan

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆటగాళ్ల ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత పేసర్ టీ. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ప్రతిగా లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు. ఈ ట్రేడ్‌లో నటరాజన్ తన పారితోషికాన్ని రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. అంటే రూ.5.75 కోట్ల తగ్గింపుతో హైదరాబాద్ జట్టులోకి తిరిగి వచ్చాడు నటరాజన్‌..

రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు నటరాజన్ తిరిగి రాక
టీ. నటరాజన్ 2020 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టి, ఆ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఢిల్లీ తరఫున ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. తాజా ట్రేడ్‌తో అతడు తిరిగి హైదరాబాద్ జట్టులో చేరాడు.

ఢిల్లీ తరఫున నటరాజన్ ప్రదర్శన ఎలా ఉంది?
గత రెండు ఐపీఎల్ సీజన్లలో నటరాజన్ మొత్తం 12 మ్యాచ్‌లే ఆడాడు. 2025 సీజన్‌లో గాయం కారణంగా ఎక్కువ సమయం జట్టుకు దూరంగా ఉన్నాడు.. 2026 సీజన్‌లో ఢిల్లీ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు మాత్రమే సాధించాడు. అతడి ఎకానమీ రేటు 11.18గా నమోదైంది. అధిక పారితోషికం, ప్రదర్శన నేపథ్యంలో ఐపీఎల్‌ 2027కు ముందు అతడిని ట్రేడ్ చేసే అవకాశాలపై చర్చ సాగింది. చివరకు హైదరాబాద్ జట్టు అతడిని తిరిగి తీసుకుంది.

ఢిల్లీకి జీషాన్ అన్సారీ.. స్పిన్ విభాగంపై దృష్టి
ఈ ట్రేడ్‌లో భాగంగా లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారుతున్నాడు. అతడు ఐపీఎల్‌లో 10 మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు సాధించాడు. అతడి పారితోషికం రూ.40 లక్షలుగానే కొనసాగనుంది. కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లి, అతడి స్థానంలో రిషభ్ పంత్‌కు సంబంధించిన ట్రేడ్ జరిగిన నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు భారత స్పిన్నర్ అవసరం ఏర్పడిందని కథనం పేర్కొంది. జీషాన్ చేరికతో ఆ విభాగంలో మరో ఎంపిక అందుబాటులోకి రానుంది.

డెత్ ఓవర్లలో నటరాజన్ సేవలు కీలకం కానున్నాయా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ విభాగంలో మరింత వైవిధ్యం తీసుకురావాలనే లక్ష్యంతో నటరాజన్‌ను తిరిగి తీసుకున్నట్లు భావిస్తున్నారు. గత సీజన్‌లో హర్షల్ పటేల్ ఐదు మ్యాచ్‌లు ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్లలో నటరాజన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ పిచ్‌లు సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో, ఒత్తిడిలో బౌలింగ్ చేయగల అనుభవం ఉన్న నటరాజన్ సేవలు జట్టుకు ఉపయోగపడవచ్చని అంచనా. ఈ ట్రేడ్‌తో రెండు జట్లు తమ అవసరాలకు అనుగుణంగా జట్టును బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ పేస్ బౌలింగ్‌లో నటరాజన్ తిరిగి చేరగా, ఢిల్లీకి భారత స్పిన్నర్ జీషాన్ అన్సారీ అందుబాటులోకి వచ్చాడన్నమాట..