Suresh Raina Cousin Dead in Road Accident: టీమిండియా మాజీ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా కజిన్ సౌరభ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో సౌరభ్ స్నేహితుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన మే 1న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. రైనా తల్లి తరపు దగ్గరి బంధువే ఈ సౌరభ్.
కాంగ్రా జిల్లాలో గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో సౌరభ్ కుమార్ ప్రయాణించిన కారు అదుపు తప్పింది. ముందుగా స్కూటర్‌ను ఢీ కొట్టిన కారు.. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరభ్ కుమార్, అతని స్నేహితులు శుభమ్, ఖాతుమ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి సౌరభ్, శుభమ్ తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కాంగ్రా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే కారు డ్రైవర్ షేర్ సింగ్ పరారయ్యాడు. అతని కోసం కాంగ్రా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా మండీలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌పై పలు కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రైనా ప్రస్తుతం ఐపీఎల్ 2024లో వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.