Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు అందిస్తోందని సంజూ చెప్పాడు. ఫైనల్ చేరుకోలేకపోవడం చాలా బాధగా ఉందన్నాడు. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది.
మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘ఇదో బిగ్ మ్యాచ్. మొదటి ఇన్నింగ్స్‌లో మేం బౌలింగ్ చేసిన తీరు పట్ల గర్వంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమిని శాసించింది. మిడిల్ ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అక్కడే మేము మ్యాచ్ కోల్పోయాము. మంచు వస్తుందని మేం ఆశించాం కానీ రాలేదు. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. ఈ అవకాశాన్ని సన్‌రైజర్స్ స్పిన్నర్లు ఉపయోగించుకున్నారు. మా కుడిచేతి బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. లెఫ్టార్మ్ స్పిన్‌లో బంతి బాగా ఆగి వచ్చింది. మే రివర్స్ స్వీప్ షాట్స్‌తో పాటు క్రీజును ఉపయోగించుకోవాల్సింది. సన్‌రైజర్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు.
Also Read: SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
‘ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి మేం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాం. ఈ క్రెడిట్ మా ఫ్రాంచైజీదే. దేశం కోసం మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను రాజస్తాన్ రాయల్స్ వెలుగులోకి తీసుకొస్తోంది. రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ భారత క్రికెట్ జట్టులో బాగా ఆడుతారు. సందీప్ శర్మ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. వేలంలో ఎవరూ కొనకపోయినా రిప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చి సత్తాచాటాడు. గత రెండేళ్లుగా సందీప్ శర్మ గణంకాలు పరిశీలిస్తే.. జస్ప్రీత్ బుమ్రా తర్వాతి బౌలర్‌గా ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇరు కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లకు ఈ పిచ్ కండిషన్స్ సరిగ్గా సరిపోతాయి. పవర్‌ప్లేలో ఎవరూ పైచేయి సాధిస్తారో చూడాలి. ఫైనల్ గొప్ప మ్యాచ్ కానుంది. గత 16 సంవత్సరాలుగా ఐపీఎల్ మనకు ఇదే అందిస్తోంది’ అని సంజూ శాంసన్ చెప్పాడు.