Site icon NTV Telugu

SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!

Srh 1

Srh 1

Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు తప్పనిసరిగా గెలవాలి. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి.. 14 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ చూస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరువ అవుతుంది.

Also Read: Sanju Samson Fine: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా.. ఇంతకీ ఏమైందంటే?

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. ఈ రోజు లక్నో కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు లక్నోతో పాటు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన గుజరాత్, పంజాబ్ చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఆడే చివరి మ్యాచ్‌లలో విజయం అంత ఈజీగా కనబడడం లేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్‌.. అదే మంత్రంతో బరిలోకి దిగితే విజయం సాధ్యమే. చూడాలి మరి ఆరెంజ్ ఆర్మీ ఎలా ఆడుతుందో.

Exit mobile version