Site icon NTV Telugu

SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

Srh Debut Match 2013

Srh Debut Match 2013

Sunrisers Hyderabad Debut Match in 2013 vs Pune Warriors: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. 2013లో ఇదే రోజు (ఏప్రిల్ 5) ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్‌లోనే జట్టు భవిష్యత్తులో ఎలా ఆడబోతుందో ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. లో స్కోర్లను కూడా అద్భుతంగా డిఫెండ్ చేయగల సామర్థ్యం జట్టుకు ఉందని ఎస్‌ఆర్‌హెచ్ ఆ మ్యాచ్‌తో నిరూపించింది. కుమార్ సంగక్కర నాయకత్వంలోని జట్టు 126 పరుగుల స్వల్ప లక్షాన్ని కాపాడుకుని.. ఏకంగా 22 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించింది.

ముందుగా హైదరాబాద్ జట్టుగా డెక్కన్ ఛార్జర్స్ ఉండేది. 2008లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫ్రాంచైజీ.. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా 2012లో డెక్కన్ ఛార్జర్స్ రద్దు చేయబడింది. ఆ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2013లో ఏప్రిల్ 5న ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్ ఆడింది. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర సారథ్యంలో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. పూణే వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 126 పరుగులే చేసింది. తిసార పెరీరా (30) టాప్ స్కోరర్ కాగా.. అక్షత్ రెడ్డి (27), పార్థివ్ పటేల్ (19) రన్స్ చేశారు. పూణే బౌలర్ అశోక్ దిండా 2 వికెట్స్ పడగొట్టాడు.

స్వల్ప ఛేదనలో పూణేకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, మనీష్ పాండేలు 36 రన్స్ జోడించారు. తిసార పెరీరా (2/29) మొదటి బ్రేక్ ఇవ్వగా.. పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (3/11), స్పిన్నర్ అమిత్ మిశ్రాలు (3/19) చెలరేగారు. దాంతో పూణే 18.5 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయింది. పూణే బ్యాటర్లలో ఉతప్ప (24) టాప్ స్కోరర్. అప్పటి స్టార్ ప్లేయర్స్ మార్లోన్ శామ్యూల్స్, యువరాజ్ సింగ్, రాస్ టేలర్, అభిషేక్ నాయర్, మిచెల్ మార్ష్ విఫలమయ్యారు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో ప్రత్యేక విజయం చేరింది.

ఆ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే స్ట్రాటజీని కొనసాగించింది. బలమైన బౌలింగ్ దళంతో తక్కువ స్కోర్లను కూడా కాపాడుతూ ప్రత్యర్థులకు కఠిన సవాల్ విసిరింది. 13 సంవత్సరాల్లో ఎస్‌ఆర్‌హెచ్ 7 సార్లు ప్లేఆఫ్స్‌కు, ఒకసారి టైటిల్ గెలిచింది. ఇది జట్టు స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. బౌలింగ్ బలం, క్రమశిక్షణ, తక్కువ స్కోర్లను కాపాడే సామర్థ్యం ఎస్‌ఆర్‌హెచ్ జట్టును ఐపీఎల్‌లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ 2026 ఆడుతోంది. ఈరోజు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ)ను ఢీకొట్టనుంది. డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఉప్పల్‌ స్టేడియం సొంత మైదానం.

 

 

Exit mobile version