Nitish Reddy React on Sunrisers Hyderabad Win: చివరి బంతి వరకూ మ్యాచ్ వచ్చినప్పుడు తాము గెలుస్తామని అస్సలు అనుకోలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అన్నాడు. ఓడిపోవడం లేదా కనీసం టై చేసి సూపర్ ఓవర్‌కు వెళ్తామని తాము భావించామన్నాడు. భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ చేస్తూ చివరి బంతికి వికెట్ పడగొట్టడం అద్భుతం అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో వికెట్ తీసిన భువీ హైదరాబాద్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ నితీశ్ రెడ్డి మాట్లాడుతూ… ‘మ్యాచ్ చివరి ఓవర్‌కు వచ్చింది. ఎవరు వేస్తున్నారని చూశా. బంతి భువనేశ్వర్ కుమార్ అందుకోగానే కాస్త నమ్మకం వచ్చింది. ఎందుకంటే.. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక చివరి బంతి వరకూ మ్యాచ్ వచ్చినప్పుడు మేం గెలుస్తామని అస్సలు అనుకోలేదు. ఓడిపోవడం లేదా టై చేసి సూపర్ ఓవర్‌కు వెళ్తామని భావించాం. కానీ భువనేశ్వర్ మ్యాజిక్ చేస్తూ చివరి బంతికి వికెట్ పడగొట్టాడు. కాసేపు నేను నమ్మలేదు. చాలా సంతోషించాం’ అని అన్నాడు.
‘బ్యాటింగ్‌లో నా పాత్ర ఏంటనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా. త్వరగా వికెట్లు పడినప్పుడు పరుగులు చేస్తూ.. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకోవాలని భావించా. గత రెండు మ్యాచుల్లో త్వరగా వికెట్స్ కోల్పోయాయి ఓటమిపాలయ్యాం. ఈసారి కనీసం 14వ ఓవర్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలనుకున్నాం. ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్ భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడతారని తెలుసు. వరుసగా రెండు పరాజయాలు ఎదురైయ్యాయి. రాజస్థాన్‌ను ఓడించడంతో మళ్లీ మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని నితీశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు.