Sai Sudharsan Hit Wicket Goes Viral in RCB vs GT Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు ఏదీ కలిసిరాలేదు. మంగళవారం ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జీటీ.. 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో తొలి ఐదు ఓవర్లలోనే గుజరాత్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా మారింది. అరుదైన హిట్ వికెట్ రూపంలో అతడు పెవిలియన్ చేరడంతో గుజరాత్ శిబిరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. క్వాలిఫయర్-1లో వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్‌లో అద్భుతమైన స్క్వేర్ కట్‌తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటుండగానే.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగుతూ వచ్చిన బ్యాట్ నేరుగా లెగ్ స్టంప్‌ను తాకి బైల్స్ కూల్చేసింది. దీంతో సుదర్శన్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. 9 బంతుల్లో 14 పరుగులు చేసిన అతడు తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. ఈ అరుదైన ఔట్ చూసి కామెంటేటర్లు, అభిమానులు కూడా షాక్ అయ్యారు.
సాయి సుదర్శన్ ఔట్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. ‘బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది’, ‘పాపం సాయి సుదర్శన్’, ‘క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్’, ‘సాయి.. అలా ఎలా అవుట్ అయ్యావ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ప్లేఆఫ్స్‌లో ఇలాంటి దురదృష్టకర ఔట్ ఎవరూ చూడాలని అనుకోరు’ అంటూ సాయి సుదర్శన్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఐపీఎల్ వంటి కీలక మ్యాచ్‌లో ఇంత విచిత్రమైన హిట్ వికెట్ నమోదవడం చాలా అరుదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఛేదనలో సుదర్శన్ ఔట్ షాక్ నుంచి జీటీ కోలుకోకముందే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్ పూర్తిగా మిస్ అయ్యాడు. కేవలం 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు జోస్ బట్లర్ మాత్రం దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. జాకబ్ డఫీ ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదిన బట్లర్ 29 పరుగులు చేసి ఔటవ్వడంతో గుజరాత్ ఆశలు సన్నగిల్లాయి. 5.1 ఓవర్లకే 51/4 స్కోరుతో జీటీ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అనంతరం జాసన్ హోల్డర్ తొలి బంతికే డక్ అవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. జీటీ బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. ఈ మ్యాచ్‌లో సాయి హిట్ వికెట్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఔట్లలో ఒకటిగా చర్చకు దారితీసింది.
Sai Sudharsan with a heartbreaking hit-wicket dismissal. 💔
Sai Sudharsan looks completely disappointed — just look at his reaction.#RCBvsGT #SaiSudharshan pic.twitter.com/zI4et8CQb1
— Faruk (@uf2151593) May 26, 2026
